బీచ్

Dhruv Vemula
dhruvtv.com
Published in
2 min readMay 12, 2014

--

సండే మద్యాన్నం మంచిగ అన్నం తిని సోఫాల కూచున్న. టీవీ ల ఏదో లఫూట్ సిన్మా ఒస్తె చూస్తుంటి. కొంచెం సేపటికి నిద్ర రాబట్టింది. ఇగ ఇప్పుడు పంటె రాత్రి నిద్రబట్టక ఎటుగాకుండ ఐతదని లేచి అటు ఇటు తిరుగుడు స్టార్ట్ జేసిన.

“ఏంది ఉత్తగ అటీటు తిర్గుతున్నవ్” అని దివ్య అన్నది.

“ఏం లే, నిద్రొస్తుంది ఏం జెయ్యాల్నొ తెలుస్తలేదు” అన్న.

“ఇప్పుడు పండకు నువ్వు, పంటె మల్ల రాత్రి లేట్ గ పంటవ్ పొద్దున్నె లేవవ్” అని దివ్య అన్నది.

“ఇప్పుడు పంటా అని ఎవడన్నడు. నిద్రొస్తుంది అని చెప్పిన అంతె. సరె గాని ఎటన్న పోదామా?” అని అడిగిన.

“ఎటు పోదాం?” అని దివ్య అన్నది. “సిన్మాకు పోదామా?” అని అన్న.

“ఎప్పుడు జూడు సిన్మాలు సిన్మాలు, సిన్మా పిచ్చివట్టింది నీకు. గీ మద్యాన్నం సిన్మాలేంది, ఏమొద్దు” అని అన్నది.

“సరే షాపింగ్ పోదామా” అంటె “నువ్వు ఏమన్న కోనేదున్నదా?” అని అడ్గింది. “ఏం లే ఉత్తగనే తిర్గి ఒద్దాం” అన్న.

ఒక చూపు చూశింది.

ఇంతల నేనే “బీచ్ పొయి చాన్రోజులు ఐంది, పోదామా?” అన్న.

సరే అని ఇగ తయారయ్యి బీచ్ కు పోయినం. ఇంటి నుండి చాననే దూరం అది. మెల్లెగ కార్ నడుపుకుంట ముచ్చట్లు చెప్పుకుంట పోయ్యేవరుకు సాయింత్రం ఆరైంది.

బీచ్ ల చూస్తె ఒకటే గాలి, చల్లగ చలివెట్టుడు. కొంతమంది తెల్లోల్లు వాల్ల కుక్కలను దీస్కోని బీచ్ ల అటీటు తిరుగుతున్రు. బీచ్ ల మనుషుల కంటె కుక్కలే ఎక్వ ఉన్నై. అవి ఎక్కడ కరుస్తయో అని నేను దూరం దూరం నడుచుడు మొదలుబెట్టిన.

“నీళ్ళల్ల దిగుదామా” అంటె “ఏమొద్దు, అంత మురికి ఉన్నై నీళ్ళు. చలికి కాళ్ళు గడ్డకడ్తయి. ఉత్తగనే నడుద్దాం” అని దివ్య అన్నది.

ఇగ కొంచం దూరం నడ్చి ఒక రొండు ఫోటోలు దిగి ఫేస్ బుక్ ల పెట్టి మళ్ళ ఎన్కకు తిర్గినం. అప్పటికే కాళ్ళు చేతులు చల్లగ అయ్యి ఎట్లనో ఐతుంది.

“అసలు మనం బీచ్ కు ఎందుకు ఒస్తం? ఒక ఈత రాదు పాడు రాదు. ఏమన్న ఆనందం ఒస్తదా అంటె రాదు. ఒకటే చలి పెట్టుడు తప్ప ఏం లేదు. చప్పుడు జెయ్యక ఇంట్ల కూచోక ఏందో ఒచ్చినం” అని దివ్య అన్నది.

“మనము రోజు మంచిగ తిని టీవీ పెట్టుకొని చల్లగ ఇంట్ల కూచుంటె ఇంటి వాల్యూ తెల్వదు. ఇట్ల మద్య మద్యల బీచ్ లకు గిన ఒచ్చి చలికి చచ్చి అవస్త పడ్తె అప్పుడు — ఆహా, ఇంటికి ఎప్పుడు పోతమో అన్పిస్తది. అప్పుడే ఇంటి వాల్యూ తెలుస్తది. అందుకే బీచ్ లకు రావాలె” అని చెప్పిన.

--

--