ఇటాలియన్ రెస్టారెంట్

Dhruv Vemula
dhruvtv.com

--

లాస్ట్ మంత్ కొంత మంది ఫ్రెండ్స్ కల్సి నాపా అని కాలిఫోర్నియాల ఒక ఊరికి పొయినం. పొద్దున్న అంత ఊర్ల సైట్ సీయింగ్ చేసే వరకు మధ్యాన్నం బాగ ఆకలి కాబట్టింది. ఏం జేద్దాం అని ఆలోచిస్తుంటె ఒక ఫ్రెండ్ ఉండి “అరేయ్, ఇక్కడ డౌన్ టౌన్ ల కొన్ని రెస్టారెంట్స్ ఉంటయ్.. యెల్ప్ ల చూసిన, పోదామా” అన్నడు.

సరే అని అక్కడికి పొయి చూస్తె అన్ని రెస్టారెంట్లల్ల విపరీతమైన రష్. “ఏడికెల్లి ఒస్తర్రా గింత మంది జనం” అని ఒకడు అన్నడు. “ఊకె టైం వేస్ట్. చప్పుడు జెయ్యక ఎదో ఒక సబ్ వే ల తిందాం పాండి” అని ఇంకోడు అన్నడు. ఇంతల ఒక ఫ్రెండ్ పొయ్యి చూశొచ్చి “అరే అక్కడ ఒక ఇటాలియన్ రెస్టారెంట్ ఉన్నది, అది ఖాళీ ఉంది, పోదాం” అన్నడు. “గింత రష్ ల ఖాళీ ఉన్నది అంటె నాకేందో తేడా కొడ్తుంది. ఏమొద్దు” అని ఒకామె అన్నది. “ఇగ ఇట్లైతె తిన్నట్టే.. ఎదో ఒకటి తొందరగ తింటె నెక్స్ట్ ప్లేస్ కు పోవొచ్చు” అని అందరం అనుకోని ఆ ఇటాలియన్ రెస్టారెంట్ కే పోయినం.

రెస్టారెంట్ల కూచున్నాక మెనూల రేట్లు చూస్తె ఒక్కొక్కల్ల మొకాలు తెల్లబడ్డయి. ఏ ఐటమ్ చూసినా మినిమం 20 డాలర్లు ఉన్నది. సరే ఇగ ఒచ్చినం కదా అని తలా ఒక ఐటమ్ పిక్ జేసినం. ఆర్డర్ జేద్దాం అంటె వెయిటర్ ఎంతకు రాడు. పది నిమిషాలు ఐంది పదిహేను నిమిషాలు ఐంది పత్తా లేడు. ఫైనల్ గ పొయ్యి పిల్చుకొచ్చినం. వాడు “కెన్ ఐ గెట్ యూ ఎనీథింగ్ టు స్టార్ట్ విత్” అన్నడు. “స్టార్ట్ ఏంది, ఎండ్ ఏంది? రెండు మూడు కోర్సులు తినేటోల్ల లెక్క కన్పిస్తున్నామా? అన్ని పైసల్ లేవు, ఒకటే ఐటమ్” అని మనసుల అనుకోని — “వి ఆర్ రెడీ, ఆర్డర్ జేస్తం” అన్నం. వాడు ఆర్డర్ తీస్కొని అందరికి ఇంత బ్రెడ్, ఆలివ్ ఆయిల్, వినెగర్ తెచ్చి పెట్టిండు.

మల్ల ఒక అర్ధ గంట అయ్యింది. “ఏందిరా వీడు, ఇంకొస్తలేడు” అని ఒకడు అన్నడు. “ఆ బ్రేడ్డే ఇంక కొంచెం తెమ్మందాం. అది తిని మెయిన్ ఆర్డర్ కాన్సల్ జేస్తె మస్తు పైసలు సేవ్ ఐతయ్” అని ఇంకొకామె అన్నది. “మొన్న ఆమధ్యల నేనూ దివ్య ఒక ఇటాలియన్ రెస్టారెంట్ పోయినం. ఇద్దరికి కలిపి 50 డాలర్స్ అయింది. ఇప్పుడు ఎనిమిది మంది ఒచ్చినం, ఎంతైతదో చూడాలె” అని నేనన్న.

ఫైనల్ గ చానా సేపటికి వెయిటర్ ఫుడ్ తెచ్చిండు. తినుడు స్టార్ట్ జేసినం. “నా చికెన్ ఏందో సరిగ్గ కుక్ ఏ చెయ్యలే వీడు.. అంత పచ్చి పచ్చిగ ఉంది” అని ఒకడు అన్నడు. “లోపల మల్ల వేడి చేసుకోని తీస్కరమ్మని చెప్పాల్నా?” అని వాని వైఫ్ వాన్ని అడిగింది. “ఈ పాస్తా మస్తు చెప్పగ ఉన్నది, చిల్లి సాస్, ఉప్పు ఎయ్యాల్సిందే” అని నేను అన్న. “నా డిష్ ఏంది గింత తక్వ ఇచ్చిండు? జస్ట్ టూ టైమ్స్ తిన్న, అయిపొయింది” అని ఒకామె అన్నది. “ఔను, అన్ని పోర్షన్స్ అట్లనే ఉన్నయి, ఈ లెక్కన సూప్ ఆర్డర్ ఇస్తె స్పూన్ ల ఇచ్చేటోడేమో” అని ఆమె హస్బెండ్ అన్నడు. “లే లే, డైరెక్ట్ గొంతుల పోస్తడు” అని మా ఫ్రెండ్ ఒకడు అన్నడు.

బిల్ అంత కలిపి 300 డాలర్స్ అయింది. “నీయమ్మ, ఈ పైసలతోని మంచిగ 30 బిర్యానీలు ఒస్తుండె” అని ఒకడు అన్నడు. “అరేయ్, పొయ్యేటప్పుడు దార్ల సబ్ వే ల ఒక సారి ఆపురా, నేను అసలు ఏం తినలే, ఆకలైతుంది” అని ఎవడో అడిగిండు. “ఛీ, ఇగ జన్మల ఇటాలియన్ రెస్టారెంట్ ల తినొద్దు” అని నేను మనసుల అనుకున్న.

మొన్న ఫ్రైడే రోజు మా ఎక్స్-కొలీగ్ ఒకడు ఫోన్ జేసిండు. “అరే! కల్సి చానా రోజులు ఐతుంది.. ఏం సంగతులు? డిన్నర్ పోదామా?” అన్నడు. “సరే పోదాం కానీ, ఫ్రైడే నైట్ కదా, మస్తు వెయిట్ టైం ఉంటది.. ముందే అనుకోవాల్సి ఉండె గద” అని నేను అన్న. “నువ్వేం టెన్షన్ వడకు, నేను మా ఆఫీస్ దగ్గర ఒక ప్లేస్ ఆల్రెడీ రిసర్వ్ జేసిన. ఇటాలియన్ రెస్టారెంట్. కొంచెం ఎక్స్పెన్సివ్ గాని ఫుడ్ బాగుంటదట. ఒచ్చేశెయ్.” అని వాడు ఫోన్ పెట్టేసిండు.

--

--